Sunday, January 29, 2017

దేశంలో తీవ్రమవుతున్న వ్యవసాయ సంక్షోభం

రైతన్నల ఆత్మహత్యలు గత మూడు దశాబ్దాలుగా దేశంలో ఆందోళనకర స్థాయిలో కొనసాగుతున్నాయి. వ్యవసాయ సంక్షోభాన్ని అంతకుముందు పెద్దగా పట్టించుకోకపోయినా.. పుష్కర కాలంగా దీనిపై పలు కమిషన్లు ఏర్పాటయ్యాయి. అధ్యయనాలు, సిఫారసులు వచ్చాయి. కేంద్రం 2004లో స్వామినాథన్‌ కమిషన్‌ను, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయతీ ఘోష్‌ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ కమిషన్‌లు ఎంతో శ్రమించి అనేక కీలక సిఫారసులతో నివేదికలు అందించాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ సర్కారు రైతులను ఆదుకునేందుకు వ్యవసాయానికి ఉచిత విద్యుత్, పావలా వడ్డీ రుణాలు, జలయజ్ఞం తదితర చర్యలను చేపట్టారు. వైఎస్‌ చొరవతో కేంద్రంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం 2008–09 బడ్జెట్‌లో దేశవ్యాప్తంగా వ్యవసాయ రుణాల మాఫీని ప్రకటించింది. గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటి  పలు చర్యలూ చేపట్టింది. కానీ.. స్వామినాథన్‌ కమిటీ సిఫారసులు చాలా వరకు అమలుకు నోచుకోలేదు. 2007లో జాతీయ రైతు విధానాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టినా అమలులో మాత్రం శ్రద్ధ చూపలేదు. మరోవైపు రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రైతు సమస్యలు విస్మరణకు గురయ్యాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబునాయుడు ప్రభుత్వం తీరుతో రైతుల పరిస్థితి మరింత దిగజారింది. ఏపీతో పాటు చాలా రాష్ట్రాల్లో రైతాంగం మళ్లీ సంక్షోభంలో చిక్కుకుపోతోంది. దిగుబడులు పడిపోతున్నాయి.

చేతికందిన పంటలకు గిట్టుబాట ధర లేదు. పోనీ ధర కోసం నిల్వ చేసుకుందామన్నా తగినన్ని సదుపాయాలు లేవు. బ్యాంకుల నుంచి రుణాలు తగ్గిపోయాయి. దీంతో రైతులు ప్రయివేటు రుణాలను ఆశ్రయిస్తూ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. రైతు ఆత్మహత్యలు మళ్లీ పెరిగిపోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి మళ్లీ పట్టణాలకు వలసలు పెరుగుతున్నాయి. సాగు సంక్షోభంలో చిక్కుకుని దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలు పెరుగుతోంటే.. ప్రభుత్వాలు మాత్రం చనిపోతున్న వారందరూ రైతులు కాదంటూ సంఖ్యను తక్కువ చేసి చూపుతున్నాయి. జాతీయ రైతు విధానం–2007ను తాము ఇప్పటికే అమలు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రకటించింది. కానీ అది ప్రకటనలకే పరిమితమైంది. ఆత్మహత్యలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ విధానాన్ని సమీక్షించడానికి ఒక నిపుణుల కమిటీని నియమించినట్లు కేంద్రం గత ఏడాది జనవరిలో సుప్రీంకోర్టుకు ఒక కేసు సందర్భంగా నివేదించింది.

స్వామినాథన్‌ సిఫారసులివీ...
2004 ఫిబ్రవరిలో అప్పటి వాజ్‌పేయి ప్రభుత్వం జాతీయ రైతు కమిషన్‌(ఎన్‌సీఎఫ్‌)ను ఏర్పాటు చేసింది. ఆ ఏడాది ఎన్నికల్లో ప్రభుత్వం మారి అధికారంలోకి వచ్చిన మన్మోహన్‌సింగ్‌ సర్కారు.. ఈ కమిషన్‌కు ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్‌ ఎం.ఎస్‌.స్వామినాథన్‌ను చైర్మన్‌గా నియమించింది. ఈ కమిషన్‌ 2006 అక్టోబర్‌ 4న తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. అందులోని సిఫారసుల ఆధారంగా రైతులపై ముసాయిదా జాతీయ విధానాన్ని కూడా రూపొందించి ప్రభుత్వానికి నివేదించింది. రైతాంగ సంక్షోభానికి.. భూసంస్కరణల అమలులో పూర్తి కాని అజెండా, నీటి పరిమాణం, నాణ్యత లోపాలు, సాంకేతికత నీరసించడం, సంస్థాగత రుణాల లభ్యత, సరిపోకపోవడం, వాటి సమయానుకూలత, భరోసాతో కూడిన, లాభదాయకమైన మార్కెటింగ్‌అవకాశాలు లోపిండం వంటివి ప్రధాన కారణాలైతే ప్రతికూల వాతావరణ అంశాలు కూడా ఈ సమస్యలకు తోడయ్యాయని పేర్కొంది. భూసంస్కరణలు తప్పనిసరి అని స్పష్టం చేసింది. వ్యవసాయాన్ని రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో చేర్చాలని సిఫారసు చేసింది. కేంద్ర ప్రభుత్వం స్వామినాథన్‌సమర్పించిన ముసాయిదా విధానం ప్రాతిపదికగా రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి 2007 అక్టోబర్‌లో తుది విధానాన్ని పార్లమెంటుకు సమర్పించింది. దాదాపు పదేళ్లు కావొస్తున్నా.. ఈ జాతీయ రైతు విధానం పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోలేదు.

భూసంస్కరణలపై కమిషన్‌ ఏం చెప్పిందంటే..

► సీలింగ్, మిగులు, బంజరు భూములు పంపిణీ చేయాలి
► నాణ్యమైన వ్యవసాయ భూమిని, అడవులను వ్యవసాయేతర అవసరాల కోసం కార్పొరేట్‌ రంగానికి మళ్లించడాన్ని నిరోధించాలి
► గిరిజనులు, పశువుల పెంపకందార్లకు అడవుల్లో పశువుల మేత హక్కులు, సీజనల్‌ ప్రవేశం, ఉమ్మడి వనరులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలి
► భూ వినియోగ నిర్ణయాలను ఆయా ప్రాంతాలు, కాలాలను బట్టి పర్యావరణ, వాతావరణ, మార్కెటింగ్‌ అంశాలకు అనుసంధానం చేసే సామర్థ్యంతో జాతీయ భూమి వినియోగ సలహా సేవ సంస్థను నెలకొల్పాలి.

సాగునీటిని సంస్కరించాలి
► వ్యవసాయ భూముల విక్రయాన్ని భూమి విస్తీర్ణం, ప్రతిపాదిత వినియోగ స్వభావం, కొనుగోలుదారు తరగతి ఆధారంగా నియంత్రించేందుకు ఒక వ్యవస్థను నెలకొల్పాలి
► రైతులకు సాగునీరు నిరంతరంగా, నిష్పక్షపాతంగా అందేలా చూడటానికి సమగ్రమైన సంస్కరణలు అమలు చేయాలి
► వర్షపు నీటిని నేలలో ఇంకేలా చేయడం ద్వారా నీటి సరఫరా పెంపొందించడం, నీటి వనరులను రీచార్జ్‌ చేయాలి. ప్రయివేటు బావులు లక్ష్యంగా ‘పది లక్షల బావుల రీచార్జ్‌’ కార్యక్రమం ప్రారంభించాలి
► 11వ పంచవర్ష ప్రణాళిక కింద సాగునీటి రంగంలో పెట్టుబడులను గణనీయంగా పెంచాలి.

ఉత్పాదకతపై
► వ్యవసాయ సంబంధిత మౌలిక సదుపాయాలపై ప్రభుత్వ వ్యయాన్ని గణనీయంగా పెంచాలి
► పంట భూమిలో సూక్ష్మ పోషకాల లోపాలను గుర్తించేందుకు ఆధునిక భూసార పరీక్ష లాబొరేటరీల జాతీయ వ్యవస్థను నెలకొల్పాలి
► భూసార ఆరోగ్యం, నీటి నాణ్యత, పరిమాణం, పర్యావరణ భిన్నత్వాన్ని పరిరక్షించే వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి


రుణాలు, బీమా విస్తరించాలి
► సంప్రదాయ రుణ వ్యవస్థను.. నిజంగా పేదలు, అవసరమైన వారికి చేరేలా విస్తరించాలి
► పంట రుణాలపై సాధారణ వడ్డీ రేటును ప్రభుత్వ మద్దతుతో 4 శాతానికి తగ్గించాలి
► రుణ చెల్లింపు సామర్థ్యం పునరుద్ధరణ జరిగేవరకూ ప్రయివేటు అప్పులతో సహా అన్ని రుణాల వసూళ్లపై మారటోరియం విధించాలి. కరవు, విపత్తుల సమయంలో రుణాలపై వడ్డీని రద్దు చేయాలి
► వరుస ప్రకృతి విపత్తుల తర్వాత రైతులకు సహాయం అందించేందుకు వ్యవసాయ విపత్తు నిధిని నెలకొల్పాలి
► మహిళా రైతులకు జాయింట్‌ పట్టాలు హామీగా తీసుకుని కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు జారీ చేయాలి
► ఒక సమీకృత రుణపంట పశుసంపద మానవ ఆరోగ్య బీమా ప్యాకేజీని అభివృద్ధి చేయాలి
► పంట బీమా కవరేజీని దేశ వ్యాప్తంగా, అన్ని పంటలకూ వర్తించేలా విస్తరించాలి. ప్రీమియంలను తగ్గించాలి. గ్రామీణ బీమాను విస్తరించేందుకు గ్రామీణ బీమా అభివృద్ధి నిధిని ఏర్పాటు చేయాలి
► రైతు సంఘాలు, స్వయం సేవా సంఘాలు, జల సంఘాల సంస్థాగత అభివృద్ధి సేవలను మెరుగుపరచడం ద్వారా పేదల జీవనోపాధులను పెంపొందించాలి
► జాతీయ ఆహార హక్కు చట్టాన్ని చేయడంతో పాటు సార్వత్రిక ప్రజా పంపిణీ వ్యవస్థను అమలు చేయడం తదితర చర్యలు చేపట్టాలి.


ఆత్మహత్యల నివారణకు..
► అందుబాటు ధరలో ఆరోగ్య బీమాను అందించాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పునరుత్తేజితం చేయాలి. ఆత్మహత్యలు అధికంగా ఉన్న ప్రాంతాలకు ప్రాధాన్యతా ప్రాతిపదికన జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌ను విస్తరించాలి
► రైతుల సమస్యలపై ప్రభుత్వం క్రియాశీలకంగా స్పందించేలా చూడటానికి రైతుల ప్రాతినిధ్యంతో రాష్ట్ర స్థాయి రైతుల కమిషన్‌ను ఏర్పాటు చేయాలి
► సూక్ష్మరుణ విధానాలను జీవనోపాధి ఫైనాన్స్‌ లాగా సేవలందించడానికి.. అంటే సాంకేతికత, నిర్వహణ, మార్కెట్ల వంటి రంగాల్లో మద్దతు సేవలతో కూడిన రుణాలను అందించడం పునర్నిర్మించాలి
► మండలం యూనిట్‌గా కాకుండా.. గ్రామం యూనిట్‌గా అన్ని పంటలకూ పంట బీమా వర్తింపచేయాలి.
► వృద్ధాప్య మద్దతు, ఆరోగ్య బీమాతో కూడిన సామాజిక భద్రతా పరిధిని అందించాలి.
► నాణ్యమైన విత్తనాలు తదితర ఇన్‌పుట్‌ సాధనాలు అందుబాటు ధరల్లో సరైన సమయంలో సరైన ప్రదేశంలో లభ్యమయ్యేలా చూడాలి.
► రైతులకు గరిష్ట ఆదాయాలు అందించే.. తక్కువ ప్రమాదం గల, తక్కువ ధర గల సాంకేతికతలను సిఫారసు చేయాలి.
► మెట్ట ప్రాంతాల్లో జీలకర్ర వంటి జీవనాధార పంటల విషయంలో మార్కెట్‌లో జోక్యం చేసుకునే పథకాలపై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరముంది. ధరల అనిశ్చితి నుంచి రైతులకు రక్షణ కల్పించడానికి ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలి.
► అంతర్జాతీయ ధరల నుంచి రైతులకు రక్షణ కల్పించడానికి దిగుమతి సుంకాలపై వేగంగా చర్యలు చేపట్టాల్సిన అవసరముంది.
► రైతుల సంక్షోభం అధికంగా ఉన్న ప్రాంతాల్లో గ్రామ విజ్ఞాన కేంద్రాలు (కేవీసీలు) ఏర్పాటు చేయాలి. ఇవి.. వ్యవసాయం, అనుబంధ జీవనోపాధులకు సంబంధించిన అన్ని కోణాల్లోనూ క్రియాశీలమైన, డిమాండ్‌తో కూడిన సమాచారాన్ని రైతులకు ఎప్పటికప్పుడు అందిస్తూ మార్గదర్శక కేంద్రాలుగా పనిచేయాలి.
► ఆత్మహత్య ప్రవర్తన సంకేతాలను ముందుగా గుర్తించే విధంగా ప్రజలకు బహిరంగ అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలి.


ఖర్చుపై 50 శాతం ఎంఎస్‌పీ..
► వ్యవస్థీకృత మద్దతును ఉపయోగించుకోవడానికి, రైతు  వినియోగదారులను నేరుగా అనుసంధానించడానికి, వికేంద్రీకృత ఉత్పత్తిని కోత అనంతర నిర్వహణ, విలువ చేర్పు, మార్కెటింగ్‌వంటి కేంద్రీకృత సేవలతో కలపడానికి, చిన్న పత్తి రైతుల సంఘాల వంటి వస్తువు ప్రాతిపదికగా రైతుల సంఘాలను ప్రోత్సహించాలి.
► కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) అమలును మెరుగుపరచాలి. వరి, గోధుమలే కాకుండా ఇతర పంటలకూ ఎంఎస్‌పీని అమలు చేయాల్సిన అవసరముంది. జొన్నలు వంటి చిరుధాన్యాలను కూడా ప్రజా పంపిణీలో శాశ్వతంగా చేర్చాలి.
► కనీస మద్దతు ధర అనేది సగటు ఉత్పత్తి వ్యయానికి కనీసం 50 శాతం అదనంగా ఉండాలి.
► మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌(ఎంసీడీ), ఎన్‌సీడీఈఎక్స్, ఏపీఎంసీ ఎలక్ట్రిక్‌నెట్‌వర్కుల ద్వారా.. 93 వస్తువులనూ చేర్చుతూ.. 6000 టెర్మినళ్లు, 430 పట్టణాలు, నగరాలలో అప్పటి మరియు భవిష్యత్తు ధరల సమాచారాన్ని అందుబాటులో ఉంచాలి.
► ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును వేగవంతం చేయడం, వ్యవసాయేతర రంగాల్లో ఉపాధి అవకాశాలను పెంపొందించడానికి చర్యలు చేపట్టాలి.

No comments:

Post a Comment